కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచితాలు ఇవ్వడం కాదు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలుకు చట్టం చేస్తామని హామి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు కోరారు.గురువారం కరీంనగర్ లోని జ్యోతి నగర్ లోని బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి దుంపటపల్లి మురళీ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ దేశంలోని 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను ప్రతి జాతీయ పార్టీ పరిగణనలోకి తీసుకొని వారి మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు.బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీ ల ఊసే ఎత్తక పోవడం ఆ పార్టీకి బిసిలపై ఉన్న వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో బీసీలకు చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ చేర్చక పోతే ఆ పార్టీ కూడా బీసీల వ్యతిరేకమని ఎన్నికల్లో ఆ పార్టీ నీ కూడా బీసీలు బొంద పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలోనీ బీసీ ఆల్ ఇండియా సేవా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చెప్పుకునే వ్యక్తి బీసీ ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని, సరోజన, మనోజ్ కుమార్, మెరుగు రవి తదితరులు పాల్గొన్నారు.









