కరీంనగర్, మే 29 (జాగో న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీ జూన్ 4వ తేదీ లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి పనులు చేయించాలని సూచించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులన్నీ సత్వరమే పూర్తి కావాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేగవంతంగా పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను పూర్తి చేసి డీఈఓ ఆఫీస్ లో అందజేయాలని సూచించారు. స్వశక్తి మహిళల భాగస్వామ్యంతో పనులను చేపట్టాలని, వారు ముందుకు రానిచోట వేరే వారితో పనులు పూర్తి చేయించాలని పేర్కొన్నారు. పనులు చేయించిన వారికి మూడు శాతం అడ్మిన్ ఛార్జీలు చెల్లించాలని, చేయించాని వారికి చార్జీలు చెల్లించవద్దని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 345 పాఠశాలల్లో పనులు సాగుతున్నాయని వివరించారు. జూన్ 4లోగా పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిరోజు పనులపై సమీక్ష జరుపుతానని, ఎంబీ రికార్డుల సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటానని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పనులపై ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవ ద్దని, రాత్రింబవళ్లు పనులు చేయించాలని సూచించారు. పాఠశాలలన్నీ కలరింగ్ తో సహా సిద్ధం చేసి ఉంచాలని పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో సైతం మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యుత్తు, తాగునీటి సరఫరా ఇతర వసతులు కల్పించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్లు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని పేర్కొన్నారు. పనులన్నీ వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ శ్రీధర్, డీఈఓ జనార్దన్ రావు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, పీఆర్ ఈఈ శ్రీనివాస్ రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.









