కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): ఈనెల 4వ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను అన్ని పక్కాగా చేపట్టాలని కౌంటింగ్ అబ్జర్వర్ జీ నజ్మా అధికారులను ఆదేశించారు. ఆదివారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను అబ్జర్వర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకో వాలని పేర్కొన్నారు. ముందే ప్లాన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు, రామ్మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.









