*మతతత్వ ధోరణులు కలిగిన ప్రొఫెసర్లు, లెక్చరర్ల తీరుతో ప్రయివేటు కళాశాలలకు చెడ్డపేరు
*ఇలాంటి వారిని గుర్తించి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తక్షణమే తొలగించాలి
*ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ విజ్ఞప్తి
కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ముస్లిం విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ తగదని ఓ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపక వర్గానికి విద్యా వ్యవస్థకే కలంకమని తద్వారా ఆయా ఇంజనీరింగ్ ఫార్మా ఎంబీఏ ఎంసీఏ ఉన్నత విద్య కు సంబంధించిన కళాశాలలకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో మెయింటర్ అయిన ఒక మహిళా ప్రొఫెసర్, ముస్లిం విద్యార్థులను జాతి పేరుతో కించపరచడం, దాయాది దేశమైన పాకిస్తాన్తో విద్యార్థులను పోల్చడం, మీ జాతితో దేశానికి ప్రమాదం ఉందని చెప్పడం జరిగిందని వెంటనే అదే రోజు సదరు ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తక్షణమే తాను పోలీసుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడం జరిగిందన్నారు. మంగళవారం కళాశాలకు వెళ్లి సదరు కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడడం జరిగిందని, సదరు మహిళా ప్రొఫెసర్, విద్యార్థులకు జరిగిన అంశంపై విచారం వ్యక్తం చేసి, క్షమాపణలు కోరినట్లు ప్రిన్సిపాల్ తమకు చెప్పారని, ఈఅంశాన్ని సద్దుమణిగేలా చొరవ తీసుకున్నట్లు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారని చెప్పారు. మతతత్వ ధోరణులను కలిగిన ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఆయా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నట్లయితే తక్షణమే వారిని గుర్తించి సదరు విద్యాసంస్థల యాజమాన్యాలు తక్షణమే తొలగించాలని, వీరి తీరుతెన్నులతో, మీవిద్యాసంస్థలకు అడ్మిషన్ల పరంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు చెడ్డ పేరు వస్తుందన్నారు. గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపమైన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సంభ్రమాశ్చర్యానికి గురిచేసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని గులాం అహ్మద్ విజ్ఞప్తి చేశారు. తామిచ్చిన సమాచారం మేరకు తక్షణమే స్పందించిన పోలీసు శాఖ అధికారులకు గులాం అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.