కురిక్యాల జెడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్

కరీంనగర్, గంగాధర: గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి.యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో సంఘటనను ఉన్నతాధికారులకు నివేదించడం, వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యం కారణంగా జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని ఆదేశించారు. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా ఇదివరకే సస్పెన్షన్ అయిన విషయం తెలిసిందే.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు