అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి *సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

కరీంనగర్/తిమ్మాపూర్: మొంధా తుఫాను మూలంగా జిల్లా వ్యాప్తంగా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని వెంటనే రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున తిమ్మాపూర్ మండలంలో నష్టపోయిన పంటలను, ఐకెపి, సోసైటి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలవడంతో అన్నదాతలు కన్నీరు అవుతున్నారన్నారు. అన్నదాతల కళ్ళముందే ధాన్యం నీళ్లలో కొట్టుకుపోవడం, నీట మునగడంతో అన్నదాతల ఆక్రందనలు మిన్న అంటుతున్నాయన్నారు. జిల్లాలో 3వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి కూరగాయల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయన్నారు. దీంతో జిల్లాలో కోట్లది రూపాయల నష్టం జరిగిందన్నారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారమే 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని చెబుతున్నారంటే అది మూడింతల నష్టం పెరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన వివరాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఐకెపి,సోసైటీ కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పాలిన్లు, గన్ని సంచులు, దారం, ప్యాడి క్లీనర్స్, అందుబాటులో ఉండే విధంగా తక్షణమే జిల్లా అధికారl యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను అనేక విధాలుగా దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, మండల కార్యదర్శి మాతంగి శంకర్, రైతు నాయకులు చిలుకూరి బాలయ్య, మాధన శ్రీహరి, చిలుకూరి కుమార్, పైడిపల్లి ఐలయ్య, దుండె దశరథం, బొర్ర అజిత్, వేల్పుల రాజయ్య, గడ్డి రాజయ్య, చిలుకూరి బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు