కరీంనగర్: మొంథా తుఫాన్ నష్టం అంచనాల నివేదికలు తయారీపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్ణీత నమూనాలో తుఫాను నష్టం అంచనా నివేదికల సమర్పించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు, క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు ఎంత మేరకు మరమ్మత్తులకు గురైందనే అంశాలను క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్దం చేయాలని, తాత్కాలిక మరమ్మత్తులు, శాశ్వత మరమ్మత్తులకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటివనరుల వివరాలు సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారుచేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేరేలా చూడాలని ఆదేశించారు.








