కరీంనగర్, మే 21 (జాగో న్యూస్): అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంధాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారధి సొసైటీ ఆధ్వర్యంలో గ్రూప్ -1 అభ్యర్థులకు ఏర్పాటు చేసిన మాక్ టెస్ట్ ను పరిశీలించారు. ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు.. ఎన్ని టెస్టులు పెడుతున్నారు.. అని పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 270 మంది గ్రూప్-1 మాక్ టెస్ట్ రాస్తున్నారని, ఐదు టెస్టులు ఏర్పాటు చేశామని అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి ప్రిపేర్ కావచ్చని తెలిపారు. జూన్ 9న జరగనున్న గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు అభ్యర్థులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత కష్టమైనా వెనుకడుగు వేయవద్దని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకెళ్లాలని, తద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వారధి సొసైటీ మెంబర్ సెక్రెటరీ జీ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, తదితరులు పాల్గొన్నారు.









