కరీంనగర్, మే 21 (జాగో న్యూస్): మే 31వ తేదీలోగా వరి ధాన్యం కొనుగోళ్లను కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగిలిపోయిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధాన్యం కొనుగోళ్లపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్లను జిల్లా కలెక్టర్లు వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోళ్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. వర్షానికి మొలకెత్తిన, తడిసిన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. మిల్లర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజినీకాంత్, ఇన్చార్జి డీఎస్ఓ సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.









