కరీంనగర్, మే 21 (జాగో న్యూస్): రాజకీయ లబ్ధి కోసం, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను మరింత జటిలం చేసేందుకు కొందరు విహెచ్ పి, బజరంగ్ దళ్ నాయకులు, ఉనికిని చాటుకునేందుకు మరికొందరు దళిత సంఘాల నాయకులు, ఎంఐఎం పార్టీ నేత మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, సత్యదూరమైన, అర్ధరహితమైన చౌకబారు విమర్శలు చేశారని, ఎంఐఎం పార్టీ కి చెందిన దళిత నాయకులు బెజ్జంకి సుధాకర్, కల్లేపల్లి బాలరాజు, అన్నేమల్ల సురేష్ తో పాటు ఖాన్ పుర, హుస్సేనీ పుర దళిత నాయకులు ఆరోపించారు. మంగళవారం ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలామ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత రెండు రోజుల నుంచి మాజీ డిప్యూటీ మేయర్, ఎంఐఎం నేత అబ్బాస్ సమీపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత యువకుడిపై దాడి అంశంలో అబ్బా సమీ ప్రమేయం లేదని తోసిపుచ్చారు. వివాదాన్ని ప్రశాంతమైన వాతావరణం లో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరచడానికి ప్రయత్నం చేస్తే బురద జల్లుతారా అని ప్రశ్నించారు. దాడి జరిగిన అంశంపై బాధిత దళిత యువకుడిని పునర్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబ్బాస్ సమీ ఇంటిలో ఎలాంటి దాడి జరగలేదని, వివాదాలను పరిష్కరించే సెక్యులర్ నాయకుడు అబ్బాస్ సమీ తప్ప వివాదాలను ప్రోత్సహించే నాయకుడు కాదన్నారు. ఏదైనా సమస్య వస్తే ఇరువర్గాలను కూర్చోబెట్టి కుల పెద్దమనిషిగా ఇద్దరినీ కౌన్సిలింగ్ చేసి బాధ్యతగా వివాదాన్ని పరిష్కరించే నాయకుడు అబ్బాస్ సమీ అని, సమీపై మొదటి సారి ఇన్ని విమర్శలు విని తాము ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి అబ్బాస్ సమీ, హుస్సేనీపుర, ఖాన్ పురాలో వందలాది దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తమ కుటుంబాల్లో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా మా కుటుంబాల్లో ఒక పెద్ద మనిషిగా వచ్చి సమస్యలను పరిష్కరించి ఇరువర్గాలకు న్యాయం చేసే హిందూ ముస్లిం ఫీలింగ్ లేని సామాజిక స్పృహ కలిగిన నాయకుడు అబ్బాస్ సమీ అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా హుస్సేనీపుర ఖాన్పురాలో పాలలో పంచదార మాదిరిగా కలిసిపోయే దళిత ముస్లింలమని, ఇక్కడ గడచిన 30 సంవత్సరాలలో అబ్బాస్ సమీ ప్రజాప్రతినిధిగా ఉన్నారని, ఎక్కడ కూడా దళిత ముస్లింల మధ్య విభేదాలు రాలేదని, ఒకవేళ ఉంటే తాము ఎందుకు ఆయనకు ఓట్లేసి ఆదరిస్తామని చెప్పారు. ఎంఐఎం పార్టీలో దళితులకు ఉన్న స్వేచ్ఛ ఏ ఇతర రాజకీయ పార్టీలో కనిపించదని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఏ కార్పొరేటర్ కార్యాలయంలోనైనా, కరీంనగర్ దారుసలాం లోనైనా, హైదరాబాద్ దారుస్సలామ్ లోనైనా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటుందని, దళితుల పట్ల ఎంఐఎం పార్టీలో ఏ మేరకు గౌరవం ఉందో గురు ఎరగాలని, దళిత సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. నాడు దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ జనరల్ స్థానంలో హైదరాబాద్ మేయర్ పీఠంపై ఆలంపల్లి పోచయ్య అనే దళితుడిని కూర్చోబెట్టిన చరిత్ర దేశంలో కేవలం ఎంఐఎం పార్టీకే దక్కుతుందన్నారు. పార్లమెంట్ వేదికగా బిజెపి ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగినప్పుడు గుంతెత్తి ప్రశ్నించేది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాదా, ఇంతకంటే దళితుల పట్ల చిత్తశుద్ధి ఇంకేం కావాలని ప్రశ్నించారు. దాడికి గురైన బాధిత దళిత యువకుడిని తిరిగి విచారణ జరిపి, అతడి వాంజ్మూలం ఆధారంగా, దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి సంబంధంలేని అబ్బాస్ సమీపపై కేసును ఎత్తివేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరి రాజు, కందుకూరి నితీష్, రజిని, తిప్పట్ల లహరి, చంద్రయ్య, కే మధు, వెంకన్న, శ్యామ్, గోపి తదితరులు పాల్గొన్నారు.









