కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అందరి సహకారంతో ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. తెలంగాణ సాధించిన ఘనతను నలదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి, విద్యుత్ సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం, తదితర పనులు చేపట్టామని పేర్కొన్నారు. పాఠశాలల పునః ప్రారంభం లోపే పనులన్నింటినీ పూర్తిచేసి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించేందుకు, నూటికి నూరు శాతం హాజరు పెంచడానికి ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ఏడవ స్థానంలో నిలిచిందని, 96.65 ఉత్తీర్ణత శాతం ఫలితాలు సాధించామని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో 1.65 శాతం ఉత్తీర్ణత పెరిగిందని వివరించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఐదవ స్థానం, సెకండ్ ఇయర్ ఫలితాల్లో నాలుగో స్థానం సాధించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు. వివిధ రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ సెంటర్ల ద్వారా ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సదుపాయాన్ని రూ .10 లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. మే 31 నాటికి జిల్లాలో 5909 మంది చికిత్స పొందగా 9,258 వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఖర్చులతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఈ సంవత్సరానికి గానూ ప్రభుత్వాసుపత్రుల్లో 8910 ప్రసవాలు జరిగాయని తెలిపారు. జిల్లాలో శిశు, మాతృ మరణాల నిష్పత్తి గణనీయంగా తగ్గిందని వివరించారు.. జిల్లాలో అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 777 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాల లోపు 57,075 మంది చిన్నారులు, 4211 మంది గర్భిణీలు, 4812 మంది బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 31, 507 మంది పిల్లలకు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు ఆర్థిక అభివృద్ధి చెందేలా నిరంతరం శ్రమిస్తున్నామని వివరించారు. ప్రతి పంట కాలానికి ఎకరానికి 5000 చొప్పున సర్కారు పెట్టుబడి సాయం అందిస్తున్నదని, జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 2.03,096 మంది రైతులకు 182 కోట్ల 12 లక్షల ఐదువేలను పంట పెట్టుబడి సహాయంగా అందించామని వివరించారు. జిల్లాలో రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేస్తున్నామని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేలా అత్యాధునిక పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 2023-24సంవత్సరానికి సంబంధించి వానకాలం, యాసంగి సీజన్లో 4 లక్షల 86వేల 603 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45 వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు గానూ రూ. 1071 కోట్లను రైతులకు ఆన్ లైన్ ద్వారా నేరుగా చెల్లించామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో ఉండే లక్ష్యంతో 2023-24 సంవత్సరానికి గానూ 43.18 లక్షల మొక్కలు నాటామని వివరించారు. జీవితంలో ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, బీడి కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో పాటు మొత్తం 1,39,061 మంది లబ్దిదారులకు ప్రతి నెలా రూ .29 కోట్ల 35 లక్షల విలువైన నగదును పింఛన్ల కింద క్రమం తప్పకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 22.16 లక్షల పనిదినాల లక్ష్యానికి గానూ 28.65 లక్షల పనిదినాలను కల్పించామని తెలిపారు. ఇందుకు గానూ 59 కోట్ల79 లక్షలను ఖర్చు చేశామని వివరించారు. జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మహిళల కోలాట నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆర్డిఓ కే మహేశ్వర్, మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ బీ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.









