కరీంనగర్, మార్చి 02 (జాగో న్యూస్): కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 3న నగరంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలు కానుండగా, దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టనుండగా, ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగనున్నది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, పూర్తయ్యే సరికి సుదీర్ఘ సమయం తీసుకోనున్న నేపథ్యంలో మూడు షిప్టుల్లో లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మాక్ కౌంటింగ్ పూర్తి
సోమవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆదివారం మాక్ కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో పాల్గొనబోయే సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ కౌంటింగ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మాక్ కౌంటింగ్ ద్వారా ఎటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు, ఆస్కారం లేకుండా కౌంటింగ్ సజావుగా సాగుతుందని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణలో ఇచ్చిన ఆదేశాలను, సూచనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించారు. ఈ మాక్ కౌంటింగ్ లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బందికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానాన్ని, నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. లెక్కింపు కేంద్రం ఆవరణలో మీడియా సెల్ ను ఏర్పాటు చేశారు. ఈ మాక్ కౌంటింగ్లో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ మహేశ్వర్, మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, లెక్కింపు సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నారు.









