గన్నేరువరం, మార్చి 02 (జాగో న్యూస్): మైలారం, ఖాసింపేట క్రాసింగ్ నుండి మానసాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభం విరిగిపోయి రోడ్డు పక్కన ఆరు నెలలుగా ప్రమాదకరంగా మారింది. వాహనాదారులు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో శనివారం రాష్ట్ర యువజన నాయకుడు సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, వాహనాదారులు విరిగిపోయిన స్తంభం వద్ద నిరసన తెలిపారు. విరిగిపోయిన స్తంభాన్ని వెంటనే మార్చాలని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ చేపట్టిన నిరసనకు స్పందించిన విద్యుత్ అధికారులు ఆదివారం విరిగిపోయిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై రైతులు నిరసన చేస్తేనే తప్ప అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. లో వోల్టేజ్ కారణంగా పలు గ్రామాలలో రైతుల మోటర్లు కాలిపోతున్నాయని అధికారులకు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు .విద్యుత్ అధికారులు విచ్చలవిడిగా రోడ్డును ఆనుకునే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని దీంతో వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారని మండిపడ్డారు. రోడ్డును ఆనుకొని ఉన్న స్తంభాలను గుర్తించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు.









