కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): ఈనెల 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించి, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం రోజున కరీంనగర్ రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆరవ తేదీ ఆదివారం రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లతోపాటు , ప్రతి కార్యకర్త ఇంటిపై బిజెపి జెండా ఆవిష్కరణ చేపట్టాలన్నారు. ఆరో తేదీ నుండి 12వ తేదీ వరకు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా మండలాల వారిగా క్రియాశీలక కార్యకర్తల సమ్మేళనాలు, గావ్ చలో, బస్తీ చలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమము ద్వారా కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం, బస్తీలు గ్రామాల్లో పబ్లిక్ సమావేశాలు, అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో చర్చ వేదికల ప్రోగ్రాములు చేపట్టాలన్నారు. అలాగే అటల్ జి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాలు, విద్యావంతులు మేధావులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జన జాగరణ కార్యక్రమాలు విస్తృతంగా జరగాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింట అట్టర్ ప్లాప్ అయిందన్నారు. 16 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. రేషన్ బియ్యం పంపిణీ విషయంలో కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు పడుతుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనపై బిజెపి నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడిగశోభ , తాజా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, సీనియర్ నాయకులు, ప్రోగ్రాం కన్వీనర్ కన్నబోయిన ఓదెలు , కో కన్వీనర్ వైద రామానుజం మాట్లాడారు.









