రాజన్న సిరిసిల్ల/ఇల్లంతకుంట: స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెండుచోట్ల సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే పత్తి కొనుగోలు చేపడుతున్నదని చెప్పారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలను నివారించేందుకు సీసీఐ ఈ కొత్త విధానం ప్రవేశపెట్టిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన విధంగా కాకుండా ముందస్తుగా సిసిఐ, వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సమయానికి మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవస్థ తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు.సీసీఐ మార్గదర్శకాల మేరకు పత్తిలో తేమ శాతం, నాణ్యత ఉంటే గరిష్ఠ ధర దక్కుతుందన్నారు. పత్తిని మధ్య దళారులకు విక్రయించి మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాలకు మాత్రమే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్ , మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, ఏఎంసి డైరెక్టర్లు,పార్టీ నాయకులు పసుల వెంకటి, రాజేశం సురేందర్ రెడ్డి తిరుపతి గౌడ్ సత్యారెడ్డి, తోపాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

								
															
															






