కరీంనగర్ ఫిబ్రవరి 04 (జాగో న్యూస్): కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. బుధవారం కరీంనగర్ నగర పాలక సంస్థ 7వ డివిజన్ పరిధిలోని సదాశివపల్లి లో ఆయన ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే కుల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తోందన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుల సంఘాల అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా పని చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. కుల సంఘాలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటి నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వివరించారు. కుల సంఘాల భవనాల్లో సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐక్యతగా ఉండడానికి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రజాహితం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న స్థానికులు బండి మమత-మల్లేశంను గెలిపించాలని, చేతి గుర్తుకు ఓట్లేసి సదాశివపల్లి ఓటర్లు తమ ఐక్యతను చాటాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మవద్దని, కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలంతా గుర్తించుకోవాలని కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, 7వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బండి మమత, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి మల్లేశం, పార్టీ నాయకులు రామిడి తిరుపతి, బండి చంద్రయ్య, మాచర్ల తిరుపతి, సింగిరెడ్డి అనంతరెడ్డి, ఏనుగు చుక్కారెడ్డి,ఏనుగు ఎల్లారెడ్డి, సింగిరెడ్డి మనోహర్ రెడ్డి, కుల సంఘాల నాయకులు ఎస్. సత్తయ్య, ఉడుత కోటేశ్వర్, నాగెల్లి నర్సయ్య, పాండ్రాల రవి, రాములు, పత్తెం తిరుపతి,ఎస్.మల్లయ్య, చిలుక శేఖర్, పంతం కిషన్. ఎస్.లింగారెడ్డి, బండి పర్షయ్య, ఎండీ బాబా,షేక్ మీర్, అంకూస్ తదితరులు పాల్గొన్నారు.








